ఏపీలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగనుండగా ప్రచారం మంగళవారంతో అంటే నేటితో ముగియనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు దాదాపు నెలరోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు. మరో కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు తుది విడత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించారు.
రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాల్లో 3,47,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించి మొత్తం 483 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, టిడిపి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య పోటీ నెలకొంది. కెఎస్.లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార బలం, అంగబలం, ఆర్థిక అంశాలతో ప్రచారం చేయగా అధికార పార్టీ నాయకుల మద్దతుతో పాటు టీడీపీ చేర్పించిన అదనపు ఓట్లతో గెలుపునకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక అధికార పార్టీ ఎమ్మెల్సీగా మీకు మేలు చేయగలనని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టింగ్‌లు, బదిలీలు, ఆర్థిక అంశాలతో ఓటర్లకు టీడీపీ వర్గాలు ఎరవేస్తున్నాయి.
మరోవైపు 14 ఏళ్లు ఎమ్మెల్సీగా వివాదాలకు దూరంగా ఉన్న లక్ష్మణరావు ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రైతు, కౌలు రైతు సంఘాలు, చేనేత కార్మికులు, స్కీం వర్కర్లు మద్ధతుతో ప్రచారం కొనసాగిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద, మధ్య తరగతి ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తారన్న పేరుంది. వివిధ తరగతుల ప్రజా సమస్యలపై వివిధ వేదికలపై స్పందించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం వల్ల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు లక్ష్మణరావుకు కలిసి వస్తున్నాయి. ద్విముఖ పోటీలో ఎదురెదురు తలపడుతున్న ఈ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos