ఏపీలో రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రిని చేయాలనే నిర్ణయంతో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు కూటమి పార్టీల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి. కుటుంబ రాజకీయాలు చేయకూడదని పవన్ ఎన్నికల ముందు పదే పదే చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పైనా నాడు కుటుంబ పార్టీ అనే ముద్ర ఉండేది. అలాంటి ముద్ర ఏ రాజకీయ పార్టీ పైనా ఉండకూడదని పవన్ చెప్పేవారు నాడు జగన్ పైనా,ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాల పైనా కీలక వ్యాఖ్యలు చేసేవారు.
ఈ విషయంలో సీఎం చంద్రబాబును అభినందించాలి. చంద్రబాబు చాలా కాలం పాటు కుటుంబ సభ్యులను ప్రోత్సహించకుండా జాగ్రత్త పడే వారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపులో లోకేష్ కీలకంగా వ్యవహరించినా.. 2017ల మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిగా తన కుమారుడికి అవకాశం ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ నారా - నందమూరి కుటుంబ సభ్యులకు లెక్కకు మించి పదవులు కట్టబెట్ట లేదు.
కానీ రీల్ తిరగేస్తే... చంద్రబాబు వైఖరిలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ నేరుగా పార్టీ విజయం కోసం పనిచేయడంతో ఈసారి ఆయనకు కాస్త ప్రయారిటీ పెరిగింది. లోకేష్ ఇప్పుడు మంత్రివర్గంలో కీలకంగా మారారు. ఇక, నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దల్లుడు లోకేష్ మంత్రిగా ఉండగా ..చిన్నల్లుడు ఎంపీగా ఉన్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కగా.. అదే పార్టీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖరారైంది. దీంతో.. అన్నా - తమ్ముడు ఇద్దరూ ఒకే మంత్రివర్గంలో పని చేయనున్నారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేయగా .. ఇప్పుడు ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కింది.
అదే విధంగా కింజరపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉండగా... ఆయన అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో బాబాయ - అబ్బాయ్ కు ప్రాధాన్యత పెరిగింది. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా.. ఆయన సతీమణి ప్రశాంతి కోవూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి విరుద్ధంగా ఇప్పుడు కూటమిలోనూ ఫ్యామిలీ ప్యాక్ అమలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ... మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవటం పవన్ ను బుజ్జగించటం కోసమే అనే చర్చ వినిపిస్తోంది. నాగబాబు కు రాజ్యసభ ఎంపీ స్థానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మొత్తంగా కూటమిలో అమలవుతున్న ఫ్యామిలీ ప్యాక్ పై ఎన్నికల్లో గెలుపు కోసం పని చేసిన కేడర్ లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos