ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో వాటికోసం విద్యార్థులు ఎంతోకాలం ఎదురుచూస్తున్నారు. అవి వచ్చిన తర్వాత కళాశాలల్లో ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ వారు చదువుతున్న కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఓవైపు రీయింబర్స్ మెంట్ విడుదల కాక.. మరోవైపు యాజమాన్యాల ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ మంత్రివర్గంతోపాటు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. అతి త్వరలోనే విద్యార్థులందరికీ శుభవార్త అందుతుందని, గత ప్రభుత్వం రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుందంటూ లోకేష్ మండిపడ్డారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడనుంది.
రానున్న నవంబరు, డిసెంబరు నెలల్లో సెమిస్టర్ పరీక్షలున్నాయి. అయితే వీటికి సంబంధించి పరీక్ష ఫీజును కళాశాలల యాజమాన్యాలు కట్టించుకోవడం లేదు. ఇవి కట్టించుకోవాలంటే ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. వైఎస్ జగన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఫథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. దీన్ని ఉపయోగించుకొని ఎంతోమంది వైద్యులు, ఇంజనీర్లు తయారయ్యారని, అటువంటి పథకానికి నిధులు పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటంటూ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకొని దాచుకోవడంపై జగన్ పెట్టిన శ్రద్ధ విద్యార్థులపై పెట్టలేదని షర్మిల మండిపడ్డారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos