అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగరనగరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేయగలిగామని, ఆధునిక పరిశోధనల ద్వారా యోగ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశామని అన్నారు. యోగా ద్వారా ప్రపంచం మొత్తం శక్తిమంతమవుతున్నదని చెప్పారు. యోగా ఆధారాల విద్యా విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తోన్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఈ విషయంలో ఓ ముందడగు వేసిందని అన్నారు. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని మోదీ చెప్పారు.
యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలనే వాటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారని మోదీ పేర్కొన్నారు. యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమంపై విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ ప్రశంసించారు.
మహిళలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ధృడత్వాన్ని సాధించడానికీ యోగా కీలక పాత్ర పోషిస్తోందనే విషయం పరిశోధనల్లో సైతం తేలిందని అన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్, ఫర్ వన్ హెల్త్ అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆరోగ్యం విషయంలో ఈ భూమండలంపై నివసించే ప్రతి ప్రాణికీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుందని, అది మానవ శ్రేయస్సుకు దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యోగా సాధన చేయడాన్ని మనం చూశామని మోదీ గుర్తు చేశారు.
దివ్యాంగులు కూడా బ్రెయిలీలో యోగా శాస్త్రాలను అధ్యయనం చేయడం గర్వకారణమని చెప్పారు. గ్రామాల్లో యోగా ఒలింపియాడ్‌లలో యువకులు విస్తృతంగా పాల్గొంటొన్నారని, దీన్ని బట్టి చూస్తే ఆరోగ్య భారత్ ను సాధించడం ఎంతో దూరంలో లేదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం, అశాంతి, అస్థిరత నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితుల్లో యోగా శాంతి, ఆయురారోగ్యాలను కోరుకుంటూ యోగాను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒపెరా హౌస్ అయినా, ఎవరెస్ట్ శిఖరం అయినా, సముద్ర జలాలు అయినా.. యోగా ఫర్ ఆల్ అనే నినాదం భారత్ నుంచి వినిపిస్తుందని మోదీ పేర్కొన్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని తాము ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో తీర్మానం చేసినప్పుడు.. ప్రపంచంలోని 175 దేశాలు ఏకీభవించాయని, దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయని పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos