కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం రైతుల నుంచి వందలాది ఎకరాల మేర భూమిని సేకరించాలనే ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇచ్చారు. అన్నం పెట్టే రైతుల నుంచి 1,777 ఎకరాల భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేయాలని ఆశించిన ప్రాంతంలో రైతుల నుండి భారీ నిరసనలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చింది. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల దేవనహళ్లిలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు జారీ చేసిన తుది నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ అవకాశాన్ని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. కర్ణాటక ప్రభుత్వం వద్దనుకున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఏపీకి ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పేస్ ఇండస్ట్రీని వద్దనుకోవడం వినడానికి చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం తన వద్ద ఓ బెటర్ ఐడియా ఉందని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీని ఎందుకు పరిశీలించకూడదని అన్నారు. ఈ ఇండస్ట్రీ కోసం ఓ ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని తాము అమలు చేస్తున్నామని వివరించారు. అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తామని చెప్పారు. వినియోగించుకోవడానికి సిద్ధంగా 8,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి.. అదికూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందని, నారా లోకేష్ తెలిపారు. త్వరలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ అధినేతలను కలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కర్ణాటక విధాన సౌధలో రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన అనంతరం సిద్దరామయ్య ఏరో స్పేస్ కంపెనీని ఏర్పాటు చేయడం లేదన్న ప్రకటన చేశారు. చెన్నరాయపట్టణ, దేవనహళ్లి తాలూకాలోని పరిసర గ్రామాలలో భూసేకరణను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ఆందోళనలకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవనహళ్లి పరిధిలో భూసేకరణను పూర్తిగా విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రైతుల నిరసన 1,198వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రైతులు వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ఆయన అన్నారు. పరిశ్రమల అభివృద్ధి ముఖ్యమే అయినప్పటికీ, బెంగళూరుకు సమీప ప్రాంతాలలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల కోసం భూమి అవసరమని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సిద్దరామయ్య చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడటమే కాదు, దానిని అమలు చేశారని ప్రశంసించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos