భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించడం తెలిపిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపురూప ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరయ్యారు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. భారత జట్టు విజయం ఖాయమవ్వగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా, నారా దేవాన్ష్ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కనిపించారు. ఈ సంతోషకరమైన క్షణాలను నారా బ్రాహ్మణి తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్టేడియంలో వాతావరణం అత్యంత ఉత్సాహభరితంగా ఉందని ఆమె అభివర్ణించారు. "చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడటం గర్వంగా ఉంది. నా ఆనందాన్ని, లోకేశ్, దేవాన్ష్ ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయాం. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించిన భారత మహిళల జట్టుకు ధన్యవాదాలు" అని బ్రాహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు తన కుమారుడు దేవాన్ష్ సంబరాలు చేసుకుంటున్న వీడియోను కూడా ఆమె జతచేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా క్రీడాకారిణుల బ్రాండ్ విలువ ఆకాశమే హద్దుగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ విజయం, పాత గాయాలను మాన్పి, వారికి సరికొత్త అవకాశాల ద్వారాలు తెరిచింది. ఈ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు ఇప్పటికే 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విజయం తర్వాత స్విగ్గీ, ప్యూమా, పెప్సీ వంటి అనేక పెద్ద బ్రాండ్లు సోషల్ మీడియాలో భారత జట్టుకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టాయి. ఈ గెలుపు భారత మహిళా క్రికెటర్లకు ఎంతోకాలంగా రావాల్సిన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే, ప్రస్తుతం లభిస్తున్న ఈ ఆదరణను భవిష్యత్తులోనూ నిలబెట్టుకోవడం వారి ముందున్న అసలైన సవాల్ గా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos