ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టి పట్టు ఉన్న ఎన్డీఏ దక్షిణాదిన కూడా బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికల వైపు ఆలోచన చేస్తున్న ప్రధాని మోదీ, అమిత్ షా దక్షిణాదిలోనూ ఎన్డీఏ కు సీట్లు ఎలా పెంచుకోవాలనే అంశం పైన ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందుకోసం కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీ ప్రజా క్షేత్రంలో విస్తారంగా తిరిగి దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు .. ప్రజల మూడ్ వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది. అమలు చేయాల్సిన నిర్ణయాలు .. సంక్షేమ పథకాలతో పాటుగా రాజకీయ వ్యూహాలను ఈ కమిటీ సూచించనుంది. ఈ కమిటీ సమన్వయ కర్తగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు.
ఈ కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడును సభ్యులుగా నియమించారు. ఈ ముగ్గురు మంత్రులు దక్షిణాది రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీ లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు సభ్యులుగా ఉండనున్నారు. వీరు స్థానికంగా ఉన్న అంశాలను కమిటీకి వివరించి.. బలోపేతానికి కావాల్సిన సూచనలు చేసేలా కార్యాచరణ సిద్దం చేసారు. రానున్న మూడేళ్ల కాలంలో ఎన్డీఏను దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నిర్దేశించారు.
ఇప్పటికే ఈ కమిటీ ఏర్పాటు.. తమ లక్ష్యాల గురించి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబుతో బీజేపీ ముఖ్యులు చర్చించారు. ఇక.. ఈ కమిటీ నిరంతరం చంద్రబాబుతో టచ్ లో ఉండాలని ఎన్డీయే నేతలు మంత్రులకు సూచించారు. చంద్రబాబు ఎన్డీఏ బలోపేతం కోసం వ్యూహాలను ఈ కమిటీకి అందించనున్నారు. అదే విధంగా జనసేనాని పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో తనకు ఉన్న ఇమేజ్ తో ఎన్డీఏ బలోపేతం కోసం తరచూ పర్యటనలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు.. పవన్ ప్రచారం ద్వారా తాము చేపట్టిన మిషన్ సక్సెస్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos