ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించి రూ.5కే రుచికరమైన టిఫిన్, భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజూ వేలాదిమంది చక్కగా క్యూ లైన్‌లో నిలబడి క్రమశిక్షణతో అన్న క్యాంటీన్లలో టిఫిన్, భోజనం తింటున్నారు. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులోని అన్న క్యాంటీన్‌లో మాత్రం ఓ సమస్య వచ్చి పడింది. దీంతో అక్కడి సిబ్బంది ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డు కూడలిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అక్కడికి ఎక్కువమంది కూలీలు భోజనం చేయడానికి వస్తుంటారు. ఇలా భోజనం చేయడానికి వచ్చిన వారిలో కొందరు మద్యం తాగి వచ్చి క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఇటీవల కొన్ని ఘటనలు జరగడంతో అక్కడి అన్న క్యాంటీన్ సిబ్బంది ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మద్యం తాగి వస్తే.. అన్న క్యాంటీన్‌లలో టోకెన్ ఇవ్వబడదు (భోజనం పెట్టరు) అని చెబుతూ అందరికీ కనిపించేలా.. 'మందు తాగి వచ్చేవారికి టోకెన్ ఇవ్వబడదు' అని రాసి ఉన్న ఒక బోర్డును డిస్ ప్లే చేశారు. సో మందుబాబులు తాగి ..అన్న క్యాంటీన్‌కు వెళితే వారికి ఆ పూట భోజనం ఉండనట్లేనని చెబుతున్నారు. ఏది ఏమైనా క్యాంటీన్ సిబ్బంది మంచి పనులు చేశారని స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 63 అన్న క్యాంటీన్‌లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజూ మూడు పూటలా 50,337 మంది పేదలకు ఆహారం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇటీవల కేబినెట్ భేటీలో కొత్త క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపగా.. వీటిని ఎక్కడ ప్రారంభించాలో ఈ నెలాఖరున క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ పనులకు టెండర్లను పిలవనున్నారని తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2024 ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 199 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos