ఏపీ విద్యార్ధులకు ఇక తెలంగాణ కాలేజీల్లో ఇక పోటీ పడే ఛాన్స్ కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ విద్యార్ధుల పైన ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని వృత్తి విద్యా కోర్సుల కోసం పోటీ పడే ఏపీ విద్యార్ధులు ఇక ఆ అవకాశం కోల్పోయినట్లే. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇక నుంచి ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85 శాతం సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వుడు కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్డు కోటాగా పరిగణించింది.
అన్రిజర్వ్డు కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా, రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటివరకు ఆయా వృత్తి విద్యా కోర్సులలో 15 శాతం ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసారు. ఆ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఇప్పుడు ఏపీ విద్యార్ధులు తెలంగాణలో పోటీ పడే అవకాశం కోల్పోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos