ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మూడో విడత పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలన్నారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని, వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయమని, కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయానని ఎవరూ భావించవద్దన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్(క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలని కండిషన్ పెట్టారు. పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో ఉండాలన్నారు. అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలన్నారు. ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్‌లో మెంబర్‌గా ఉండాలన్నారు. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయని, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని సీఎం అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos