మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వరసగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో కీలకనేత తమ్మినేని సీతారాం కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక తన అనుచరులతో సమావేశమైన అనంతరం తన నిర్ణయాన్ని బయటకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమయింది. తర్వాత ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన అనంతరం తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆముదాల వలస నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్ గా పనిచేశారు. ఆయన గత కొంత కాలంగా పార్టీ హైకమాండ్ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమ్మినేని సీతారాం టీడీపీలో చేరే అవకాశం లేదు. ఆ పార్టీలో ఆయన ప్రత్యర్థి కూన రవికుమార్ ఉన్నారు. దీంతోపాటు టీడీపీకి అనేకసార్లు గుడ్ బై చెప్పడం, చంద్రబాబుపై విమర్శలు చేయడం, స్పీకర్ గా టీడీపీ నేతలను సభలో నిలువరించడం వంటి కారణాలతో ఆయనకు సైకిల్ పార్టీలో చోటు దక్కే ఛాన్స్ లేదు. అందుకే తమ్మినేని సీతారాం జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పటికే జనసేన అగ్రనేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇది వైసీపీకి ఉత్తరాంధ్రలో కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos