ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా అమరావతిలో ప్రముఖుల విగ్రహాలను, స్మృతి వనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. శాఖమూరులో 6.8 ఎకరాలలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్‌గా నామకరణం కూడా చేశారు.
నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో భాగంగా.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులను షీలాడియా అసోసియేట్స్ అనే సంస్థకు సీఆర్డీఏ అప్పగించినట్లు తెలిసింది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డీపీఆర్ తయారీకే రూ.11.56 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నీరుకొండ వద్ద ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం 182 మీటర్ల ఎత్తు ఉండనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటుగా స్మృతివనం రూపొందించాలని.. అలాగే నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దాలని చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
అమరావతిలో ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం 600 అడుగులు ఎత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తు గురించి ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఎన్టీఆర్ విగ్రహం ప్రాజెక్టు నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గుజరాత్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా పరిశీలించి వచ్చారు. ఏక్తానగర్‌లోని పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీని మంత్రి ఇటీవల పరిశీలించారు. పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారనే వివరాలతో పాటుగా.. ఎలాంటి సాంకేతికత వాడారనే దానిపైనా వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos