ఏ రంగంలోనైనా వారసత్వం మిథ్యేనని, నారా లోకేష్‌కు వ్యాపారాలు చేయడమే సులువని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సుల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అవకాశాలను అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలోనైనా రాణిస్తారని, లోకేశ్‌కు వ్యాపారాలు చేయడం సులువైనా ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు. కేంద్ర మంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని, ఏ రంగంలోనైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేశ్ వారసత్వంపై అడిగిన ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు 'చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరన్నారు. నేను జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసిన తర్వాతే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని, ఇందులో రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవని ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టప రంగానే వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు. సుస్ధిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నానని వారు కూడా వాస్తవాలు తెలుసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో 93% స్థానాలతో గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజలు విజయాన్ని అందించారని దానిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నామని చెప్పారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, కేంద్రమంత్రి అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన విద్వంసాన్ని చూసి ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని ఏపీ పునర్నిర్మాణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా సాయం అందిస్తోందని చెప్పారు. జగన్ ప్రజల్ని ఒక్కసారి మాత్రమే మోసం చేయగలిగాడని, ఎప్పుడూ చేయలేడన్నారు. అదానీ విద్యుత్తు కాంట్రాక్టులపై అక్రమాలపై స్పందించిన బాబు ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉందని, దానిపై ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos