శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం తిరుమలలో మరో అత్యాధునిక వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.102 కోట్లు వెచ్చించి వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ–5)ను నిర్మించింది. ఈ వసతి సముదాయాన్ని ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అధికారులు పాల్గొన్నారు. వేంకటాద్రి వసతి సముదాయంలో ఒకేసారి 4 వేల మందికి వసతి సౌకర్యం కల్పించవచ్చు. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, ఒకేసారి 1400 మంది భోజనం చేసేందుకు వీలుగా రెండు డైనింగ్ హాళ్లు ఉన్నాయి. భక్తులకు 24 గంటలూ వేడి నీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ప్రాంగణంలో కల్యాణకట్టను ఏర్పాటు చేశారు. కాగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవాలయం లోపలికి వెళ్ళిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు వకుళామాత ఆలయం, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ ప్రధాన గోపురం నుంచి పెద్ద శేషవాహనంపై తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos