కాకినాడ జిల్లా పిఠాపురంలో జయకేతనం పేరుతో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కూటమి భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. రాష్ట్ర, జాతీయ అంశాలపై తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారా. తమిళనాడు రాజకీయాలపైనా వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు. హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ.. హిందీని మాట్లాడకూడదా అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్ చేసుకోంటున్నారంటూ చురకలు అంటించారు. ఇదేం లాజిక్కో అర్థం కావట్లేదని అన్నారు.
భారత్‌లో లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామనీ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదనీ ఆయన స్పష్టం చేశారు. ఇది- పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడికి తెర తీసినట్టయింది. గతంలో ఇదే పవన్ కల్యాణ్ హిందీ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలు, ట్వీట్లు, దినపత్రిక క్లిప్పింగ్‌ను సోషల్ మీడియా యూజర్లు, నెటిజెన్లు తవ్వి తీశారు. వాటిని ట్రెండ్ చేస్తున్నారు. Chameleon అనే ట్యాగ్‌ను జోడిస్తున్నారు. ఫలితంగా ఈ పదం ట్రెండింగ్ అవుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పవన్ విమర్శించిన సందర్భాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. గతంలో తెలుగేతర సీనియర్ ఐఎఎస్ అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా అపాయింట్ చేసినప్పుడూ ఆయన తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos