డిప్యూటీ సీఎం పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. దశాబ్దాల కాలంగా ఉద్యోగుల పైన విజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉండటం పైన పవన్ సీరియస్ అయ్యారు. ఈ అంశం పైన తాను పర్యవేక్షిస్తున్న అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఉద్యోగుల పైన సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విజిలెన్స్ కేసుల పైన ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ ... ఇన్నేళ్లు పెండింగ్ లో ఉండటం ఏంటని నిలదీసారు. ఎన్ని కేసులు ఇలా పెండింగ్ లో ఉన్నాయని లెక్కలు అడిగారు. విచారణలో జాప్యానికి కారణాలు.. కేసుల వివరాలతో తనకు మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ ఉండాలని..ఉద్యోగులు అప్రమత్తంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని పవన్ పేర్కొన్నారు. అయితే ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉండడం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతోందని పవన్ పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ శాఖల్లో విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి, అందుకు గల కారణాలపై మూడు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను పవన్ ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు పవన్ దృష్టికి తెచ్చారు. అపరిష్కత కేసుల వల్ల అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటెర్మెంట్ బెనిఫిట్స్ పొందలేక పోతున్న విషయం చర్చకు వచ్చింది.
దీంతో, తన శాఖల పరిధిలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు పవన్ ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన రీతిలో తిరిగి విచారించి, వేగంగా పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు. మూడు వారాల తరువాత ఈ కేసుల విషయంలో తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos