ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కుటుంబాలు.. దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా.. ఇలాంటి చర్యలు ఏంటని స్థానిక గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
ఈ నెల 16న మల్లాం గ్రామానికి చెందిన జల్లిబాబు ఇంటిలో కరెంట్ పని చేస్తూ ప్రమాదవశాత్తు అదే గ్రామానికి చెందిన పల్లపు సురేశ్ అనే దళితుడు మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. నష్టపరిహారం కింద రూ. 2.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన అగ్రవర్ణాల కుటుంబాలు.. దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులు వస్తువులు అమ్ముకోకుండా హుకుం జారీ చేశారు. గ్రామంలో ఓ వర్గానికి చెందిన వారికి హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వొద్దని, నిత్యావసరాలు విక్రయించొద్దని ఆంక్షలు విధించారు. ఆదేశాలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ మేరకు పిఠాపురం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. రెవెన్యూ అధికారులు వచ్చి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos