కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను కలెక్టర్ షగిలి షన్మోహన్ సముద్రంలో పట్టుకున్న రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్లి దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవా... తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని పవన్ ఈ ఆదేశాలు ఇచ్చారా... పవన్ ఆదేశాలను ఇప్పుడు పాటించే పరిస్దితి లేక ప్రభుత్వం ఇరుకునపడిందా.. ఇప్పుడేం చేయబోతోంది.. ఇప్పుడు ఇలాంటి అంశాలపైనే కాకినాడ పోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కాకినాడ పోర్టులో సౌతాఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్ 1 నౌకలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంతో దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే సముద్ర రవాణా ప్రభుత్వ పరిధిలోకి రాదు. అందులో స్మగ్లింగ్ జరిగితే దాన్ని సీజ్ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పట్టుకున్న రేషన్ బియ్యం రవాణా స్మగ్లింగ్ కిందకు రాదని అధికారులు చెప్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ షిప్ ను సీజ్ చేసే పరిస్దితి లేదని అర్ధమవుతోంది.
ఇలాంటి పరిస్దితుల్లో ఆ షిప్ ను వదిలేయాలా లేక మరేదైనా చర్యలు తీసుకోవాలా అన్న మీమాంసలో పడిన అధికారులు, కాకినాడ పోర్టు యాజమాన్యం.. చివరికి నో డ్యూ సర్టిపికెట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దాన్ని అడ్డుకుంది. అయితే ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ప్రభుత్వం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. దీంతో పౌరసరఫరాలశాఖ ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఆడ్మిరాలిటీ కోర్టు అంటే ఏంటి... మామూలు కోర్టులకూ దీనికి తేడా ఏంటి అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
సముద్రంలో తలెత్తే వివాదాలకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించేందుకు చట్ట ప్రకారం సాధారణ కోర్టుల్లో ఎంపిక చేసిన వాటికి అడ్మిరాల్టీ అధికారం కల్పించారు. ఇలా అడ్మిరాల్టీ కోర్టు అధికార పరిధిని కలిగి ఉన్న హైకోర్టుల జాబితాలో కలకత్తా, బొంబాయి, మద్రాస్, కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, కేరళ, హైదరాబాద్‌లతో సహా భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు ఉన్నాయి. ఇవన్నీ సముద్ర సంబంధ దావాలకు సంబంధించి హైకోర్టుల అధికార పరిధి, వాటి సంబంధిత అధికార పరిధిలోని ప్రాదేశిక జలాల్లో వివాదాల్ని పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్తి ఆ షిప్ వ్యవహారం తేల్చాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos