ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం భారీఎత్తున విదేశాలకు తరలివెళ్లిపోయిన సమస్య కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతుండటంతో కూటమి నేతలకు తిప్పలు తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్నా పరిస్దితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కలెక్టర్, ఎస్పీ ఛేజ్ చేసి మరీ పట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ షిప్ ను పరిశీలించేందుకు ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. సౌతాఫ్రికా షిప్ తో పాటు మరో బాచి (షిప్ కు లోడు తరలించే లాంచీ)లో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా పవన్, మనోహర్ కలిసి పరిశీలించనున్నారు.
ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు రైస్ మాఫియా తరలిస్తూనే ఉంది. అదీ కాకినాడ కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ ను అధికారులు గుర్తించారు. వీరికి అడ్డుకట్ట వెయ్యడానికి స్వయంగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ నేరుగా పరిశీలన చేయనున్నారు.
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గన్నవరం నుండి విమానయానం ద్వారా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో 12 గంటలకు కాకినాడ చేరుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సమీక్షలకు అవకాశం లేదు. కాకినాడ పోర్టుతో పాటు పలుచోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ... అరబిందో ఫార్మా బాధితులను కలిసే అవకాశం ఉందని, పర్యటన అనంతరం సాయంత్రం మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారని సమాచారం. పవన్ టూర్ తర్వాత అయినా ఈ అక్రమ బియ్యం రవాణా ఆగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos