ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ రోజుతో ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పవన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు పవన్ స్పందించకపోవటం కూటమిలో సంచలనంగా మారుతోంది. పవన్ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల యాత్రలో భాగంగా కొచ్చి చేరుకున్నారు.
కాగా పవన్ కల్యాణ్ కొంతకాలంగా జ్వరం, వెన్ను నొప్పితో బాధ పడుతున్న కారణంగా మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు. నిన్న చంద్రబాబు కేబినెట్ మంత్రులు, శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి పవన్ హాజరు కాలేదు. ఈ సమయంలో మంత్రి మనోహర్ జోక్యం చేసుకొని పవన్ వెన్నునొప్పితో బాధ పడుతున్నారని.. అందుకే హాజరు కాలేదని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ పవన్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని, కానీ దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని అడిగారు.
తాను స్వయంగా ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి పవన్ రాలేదని చంద్రబాబు సమావేశంలో ఓపెన్ గా చెప్పటం ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చగా మారింది. పవన్ స్పందించకపోవటం వెనుక కారణాల పైన కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల ర్యాంకింగ్స్ ను చంద్రబాబు వెల్లడించారు. పవన్ లేని సమావేశంలో ర్యాంకుల ప్రకటన పైన రాజకీయంగా చర్చ జరిగింది.
ఇప్పుడు.. పవన్ శాఖలోనే ఫైళ్ల పెండింగ్ అంశం నిన్న కార్యదర్శుల సమావేశంలో లెక్కలతో సహా అధికారులు వెల్లడించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జనవరి నెలాఖరు వరకు పెండింగ్ ఉన్న పైళ్ల వివరాలను ప్రస్తావించారు. చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు తాను మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల వెనుక కారణాలను వివరించారు. ఒకరిని తక్కువ చేయటానికో.. మరెవరినో ఎక్కువ చేయటానికో ర్యాంకులు ఇవ్వలేదని స్పష్టం చేసారు. నిన్న కార్యదర్శల భేటీలోనూ మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. అయితే, పవన్ ఈ అంశం తో పాటుగా రాజకీయంగా కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాను ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి రాలేదని నేరుగా చంద్రబాబు చెప్పటం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos