విశాఖపట్నానికి సంబంధించిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ - GVMC మేయర్ పీఠాన్ని ఇటీవల కూటమి కైవసం చేసుకుంది. నేడు విశాఖ మేయర్ ఎన్నికకు ఓటింగ్ జరగాల్సి ఉంది. మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దాంతో విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇటీవల విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 19న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. అధికార పక్షం కూటమి నెగ్గింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓట్లు వేశారు. వైసీపీ నుంచి కూటమిలో చేరిన కార్పొరేటర్లు సైతం అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. దాంతో హరివెంకట కుమారి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కోల్పోయారు. వైసీపీకి విశాఖ మేయర్ పీఠం దూరం చేసిన కూటమి కార్పొరేటర్లు నేడు తమ మేయర్ గా పీలా శ్రీనివాసరావుకు మద్దతుగా నిలిచారు. జీవీఎంసీ పాలకవర్గం సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశమైంది. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన మేయర్ ఎన్నిక సమావేశానికి జీవీఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. అనంతరం జీవీఎంసీ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు పీలా శ్రీనివాసరావుకు జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైనట్లు ధ్రువపత్రం అందజేశారు.
విశాఖ నగర పాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తమ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కానీ వైసీపీకి భారీ మెజార్టీ రావడంతో పీలా శ్రీనివాసరావుకు మేయర్ పదవి దక్కలేదు. గత నాలుగేళ్ల నుంచి విశాఖ నగరంలో టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి నేడు ఫలితం దక్కింది. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం పీలా శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చింది. నేడు ఆయన తొలిసారి జీవీఎంసీ మేయర్ అయ్యారు.
మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక చైర్మన్ ఎన్నిక ఇవాళ జరిగింది. ఐదో వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యుడు ఎస్ డీ హఫీజ్‌కు వైసీపీ మద్దతు తెలిపింది. నేడు జరిగిన ఓటింగ్ లో కూటమి అభ్యర్థి సెల్వరాజ్‌కు 15 ఓట్లు రాగా, వైసీపీ ప్రతిపాదించిన అభ్యర్తి హఫీజ్‌కు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం పురపాలిక చైర్మన్ అయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరాజు సెల్వరాజ్ విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదిలాఉండగా.. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి కార్పొరేటర్లు బలపరిచిన రవీంద్రకు 34 ఓట్లు రాగా, వైసీపీ మద్దతు తెలిపిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దాంతో గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి... ధ్రువీకరణ పత్రం అందజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos