రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం జయసుధ విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని నివాసానికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అతికించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పేర్ని జయసుధ న్యాయవాదులతో కలిసి బందరు తాలూకా పోలీస్‌స్టేషన్ వచ్చారు.
కాగా పేర్ని జయసుధ విచారణకు రావటం సంగతి పక్కనబెడితే.. ఇక్కడ మరో విషయం చర్చనీయాంశమైంది. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ.. మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రభుత్వ వాహనంలో విచారణకు రావచ్చా అంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను పోలీసులు పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. ఆర్. పేట సీఐ.. పేర్ని జయసుధను విచారిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. దీంతో పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసుపై దర్యాప్తు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు.. గోడౌన్‌లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో మిగతా బియ్యానికి కూడా జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ సరే కానీ... ఆమె ప్రభుత్వ వాహనంపై విచారణకు రావచ్చా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos