గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు ఇవాళ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఘోర విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు నేలపై ఉన్న స్థానిక నివాసితులు, బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించగా.. మృతుల సంఖ్య 274కు చేరుకుంది. మృతుల్లో.. విమానంలో ఉన్న 241 మంది సహా స్థానికంగా సంఘటన స్థలంలో 35 మంది ఉన్నారు. భారత దేశ విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన స్థలంలో శిథిలాలను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) శుక్రవారం రోజే లభ్యం కాగా.. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయం తెలుసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాంకేతిక లోపం, మానవ తప్పిదం, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. అలాగే మృతదేహాలన్నీ గుర్తు పట్టలేని విధంగా మారిపోగా.. వారిని గుర్తించేందుకు అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు.
ఇందుకోసం మృతుల కుటుంబసభ్యులు, బంధువుల దగ్గరి నుంచి శుక్రవారం రోజు పెద్ద ఎత్తున DNA శాంపిల్స్ సేకరించారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో అనేక మంది వైద్య సిబ్బంది ఈ శాంపిల్స్ సేకరించగా.. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రిలో క్యూ కట్టారు. అయితే రెండు రోజుల పాటు ఈ ప్రక్రియ కొసాగుతుందని.. శాంపిల్స్ సేకరించిన 72 గంటల తర్వాత మృతదేహాలను అప్పగించేందుకు వీలవుతుందని సిబ్బంది వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos