ఏపీ రాష్ట్ర పురోభివృద్ధి దిశగా బుధవారం కీలక అడుగులు పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఏపీకి వచ్చిన నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు శుభవార్త వినిపించారు. ఏపీని అభివృద్ధి బాట పట్టించేలా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
సుమారుగా లక్షా 85 వేల కోట్ల భారీ పెట్టుబడితో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 1,200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కానుంది. 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎన్‌టీపీసీ అనుబంధ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ హబ్ ఏర్పాటుకానుంది.
వాస్తవానికి పదేళ్ల కిందటే ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వద్ద అది సాధ్యపడలేదు. 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పూడిమడక వద్ద ఎన్టీపీసీ ఆధీనంలో ఉన్న భూమిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కానుంది.
ఇదిలా ఉండగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మోదీ రాష్ట్రానికి రూ.2.08 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని, విశాఖ వాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వస్తోందని తెలిపారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ అని సీఎం కొనియాడారు. ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఈసారి మనం గెలిచామని, ఇదే కాంబినేషన్ భవిష్యత్తులోనూ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. దిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని, రాసిపెట్టుకోండంటూ ధీమా వ్యక్తం చేశారు.
సూపర్‌సిక్స్ హామీలన్నీ అమలుచేసే బాధ్యత తమదని భరోసా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కేంద్రం అండతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని, రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ మారడం ఖాయమని స్పష్టం చేశారు. అరకు కాఫీని మోదీ బాగా ప్రచారం చేస్తున్నారని, ఆయనని స్ఫూర్తిగా తీసుకుని నిత్యం ముందుకెళ్తానని తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని కోరుతున్నామని చెప్పారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, కేంద్రం సాయం కావాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos