ఏపీ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు కీలక సమాచారం బయటపెట్టారు. శనివారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి, హైదరాబాద్ నుంచి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు పాస్టర్ ప్రయాణం, ఆ మార్గంలో జరిగిన సంఘటనలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివరణ ఇచ్చారు.
ప్రయాణ వివరాలు & సీసీటీవీ ఆధారాలు:
హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ బయలుదేరిన సమయం, ఆయన మార్గంలో ఆగిన స్థలాలు, మాట్లాడిన వ్యక్తులు – అన్నింటినీ పోలీసులు నిర్దిష్టంగా గుర్తించారు. మార్గమధ్యంలో మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాల్లో పాస్టర్ చిక్కుకున్నట్లు తెలిసింది. ఆయన బైక్ ముందు హెడ్‌లైట్ ధ్వంసమై, వాహనాన్ని రైట్ ఇండికేటర్ వేసుకుని నడిపినట్లు ఫుటేజ్ ఆధారంగా వెల్లడైంది.
యూపీఐ ట్రాన్సాక్షన్లు & రూట్ మ్యాప్:
ఆయన ప్రయాణ సమయంలో రెండు వైన్స్ షాప్‌లలో, కొన్ని పెట్రోల్ బంక్‌లలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డులు పోలీసులు చూపించారు. ప్రయాణ చివరి దశలో ఆయన బైక్ 70 కి.మీ వేగంతో కదులుతుండగా, రోడ్డులో ఉన్న కంకరల కారణంగా స్లిప్ అయింది. బైక్ గుంతలో పడిపోవడంతో బరువు మీద పడ్డట్టు పోలీసులు పేర్కొన్నారు. గుంత అర్ధచంద్రాకారంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం మరింత తీవ్రమయ్యిందని వివరించారు.
మరణంపై వస్తున్న సందేహాలపై క్లారిటీ:
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో చెలామణి అవుతున్న తప్పుడు ప్రచారాలపై స్పందించిన ఐజీ అశోక్ కుమార్, అన్ని కోణాలనుంచి విచారణ జరిపామని, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా బైక్‌ను ఎలాంటి వాహనం ఢీకొట్టలేదని నిర్ధారించామన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో పాస్టర్ మద్యం సేవించి ఉన్నట్టు స్పష్టం అయ్యిందన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై నోటీసులు జారీ చేసి, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos