ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన ప్రసంగంలో చంద్రబాబు... రఘురామను ఒక పోరాట యోధుడిగా, ధైర్యసాహసాలకు మారుపేరుగా అభివర్ణించారు. కల్మషం లేని వ్యక్తి రఘురామ అని పేర్కొన్నారు.
గతంలో ఎవరెంత భయపెట్టాలని చూసినా, వెనుకంజ వేయకుండా, తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకెళ్లారని కొనియాడారు. ఆ సమయంలో ఏమాత్రం భయపడి ఉన్నా రఘురామ పరిస్థితి ఎలా ఉండేదో అని వ్యాఖ్యానించారు. కానీ అన్ని కష్టాలను నిబ్బరంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఆనాడు ఎలాంటి కుట్రలు చేయకపోయినా, ఏకపక్షంగా వ్యవహరించి రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారని చంద్రబాబు వెల్లడించారు.
2021 మే 14న రఘురామను అరెస్ట్ చేశారని, ఆ రోజు ఆయన పుట్టినరోజు అని తెలిపారు. పుట్టినరోజునే అరెస్ట్ చేసిన పైశాచిక ఆనందం పొందారని, ఒక ఎంపీని అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం దేశంలో సంచలనం సృష్టించిందని వివరించారు. హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తిని ఆ విధంగా టార్చర్ చేయడం గతంలో జరగలేదని అన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను... ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు, వినలేదు... బహుశా ఇదే మొదటిది, చివరిది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారంటూ రఘురామపై నాడు రాజద్రోహం కేసు పెట్టారు. టీవీ5, ఏబీఎన్ చానళ్లతో కలిసి కుట్ర చేశారని ఆరోపణలు మోపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రఘురామ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత హిట్టయిందో... రాజకీయాల్లో రఘురామ రచ్చబండ కార్యక్రమాలు కూడా అంతే హిట్టయ్యాయి. ఆయన డిప్యూటీ స్పీకర్ గా నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాను" అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos