ఏపీ రాష్ట్రాన్నివానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వరుస అల్ప పీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 25న ఏర్పడే అల్ప పీడనం 27న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో.. ఉత్తర కోస్తా, యానాంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకటి లేదా రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీని ప్రభావంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరపు చుట్టుపక్కల భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos