ఏపీలో వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వం నుంచి గద్దె దిగిన తర్వాత కూడా ఆ పార్టీ నేతల ఆగడాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ముఖ్య నేత పైన అత్యాచారం కేసు నమోదైన విషయం వెలుగు చూసింది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మేరుగ నాగార్జున పైన తాడేపల్లి పోలీసుస్టేషన్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోపాటు శారీరకంగా వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రికి సహకరించి, బాధితురాలిని బెదిరించిన ఆయన పీఏపై బెదిరింపుల కేసు నమోదు అయింది. ఈ క్రమంలో మేరుగ నాగార్జున పైన రేపు కేసు వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసిన మహిళ ... మాజీ మంత్రి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. తనకు అయిదేళ్లు గా మేరుగతో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఆయన పీఏ మురళీమోహన్‌రెడ్డి తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని మంత్రి ఉండే అపార్టుమెంట్‌కు తీసుకెళ్లేవారని వివరించారు. గదిలోకి వెళ్లిన వెంటనే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడని చెప్పారు.
తనకు ఎలాంటి కాంట్రాక్ట్ పనులు ఇప్పించకపోగా.. మాజీ మంత్రి తనను బలవంతంగా నాలుగుసార్లు శారీరకంగా అనుభవించారని ఆరోపించారు. తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయడినా పట్టించుకోలేదన్నారు. గట్టిగా అడిగితే విశాఖకు చెందిన ఓ గిరిజన టీచర్‌ను స్లోపాయిజన్ ఇచ్చి హత మార్చామని... తనకు కూడా ఆ గతే పడుతుందని ఆయన పీఏ బెదిరించారని చెప్పుకొచ్చారు. అప్పులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు వివరించారు.
అయితే, మేరుగ నాగార్జున ఈ వ్యవహారం పైన స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎటువంటి పరీక్షలకైనా, ఉరిశిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మహిళ వద్ద రూ.90 లక్షలు తీసుకున్నానని చెప్పడం, ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాననడం అవాస్తవమని చెప్పారు. తనపై ఆరోపణలు, ఫిర్యాదులు అంతా కుట్ర ప్రకారం జరిగాయని వివరించారు. ఈ ఫిర్యాదుపై తానే జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్థాయి విచారణ కోరతానని తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానని మేరుగ నాగార్జున చెప్పుకొచ్చారు. పోలీసుల విచారణ తరువాత నిజానిజాలు తెలుస్తాయని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos