ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కంపెనీ పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తి ప్రదర్శిస్తోంది. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సమీపంలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీ పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులు సంతబొమ్మాలి మండలంలో పర్యటించి భూములను పరిశీలించారు. ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులతో పాటుగా టెక్కలి ఆర్డీవో ఆ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక పరిస్థితులను ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులకు వివరించారు.
మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి స్థలం కూడా కేటాయించారు. అలాగే విశాఖకు లులు మాల్ కూడా రానుంది. రాష్ట్రంలో లులూ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో లులూ మాల్ ఏర్పాటుకు లులూ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తాజాగా కాగ్నిజెంట్ సంస్థ కూడా విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసి 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది.
కాగ్నిజెంట్ సంస్థ ప్రకటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ సంస్థ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఉత్తరాంధ్ర ఉన్నతికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికి ఉదాహరణ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు అభివృద్ధిని తీసుకెళ్లాలని ఎల్లప్పుడూ విశ్వసించిన నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ధన్యవాదాలు, ఉత్తరాంధ్ర ఇప్పుడు పురోగతి వైపు వేగంగా పయనిస్తోంది. 8వేలకు పైగా టెక్ ఉద్యోగాలు అంటే మన యువత ఇప్పుడు ఇక్కడే, వారి సొంతూరిలో, వారి కుటుంబాలకు దగ్గరగా వారి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మార్పు ఇలా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు, ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి రోజులు ఇలా ప్రారంభమవుతాయి." అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos