ప్రకాశం జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు.
గడ్డమీదపల్లికి చెందిన రైతు కూలీలు బొప్పాయి కాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో ట్రాలీలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీ పూర్తిగా ధ్వంసమవ్వగా.. సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రికి తరలించేలోపు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వాపోతున్నారు.
ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తుతో పాటు అతి వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గాయాలపాలయిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేశారు.
ఘటనలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గడ్డమీదపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామస్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాగా ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. యాక్సిడెంట్‌లో అయిదుగురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. అనంతరం ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos