ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్దమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఆర్దిక సంవత్సరంలో మరో రెండు పధకాల అమలుకు కసరత్తు జరుగుతోంది. తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఈ మేరకు నిబంధనలు ఖరారైనట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన అంటే రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో తల్లికి వందనం, రైతు భరోసా అమలు మార్గదర్శకాల పైన చర్చించనున్నారు. పాలనాపరమైన అంశాలతో పాటుగా ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రెండు పథకాల అమలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మే లో నిధుల జమ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతీ ఇంటా చదువుకునే ప్రతీ ఒక్కరికి ఈ పథకం అమలు అవుతుందని వెల్లడించారు.
తల్లికి వందనం కోసం బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించగా.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని కూటమి నేతలు చెబుతున్నారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పస్టం చేస్తోంది. వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని.. ఇందు కోసం రూ 13 వేల కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75 శాతం హాజరు తప్పని సరి చేసారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాల పైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు.
ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు..తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తల్లికి వందనం నిధులు జూన్ లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా.. అర్హత, మార్గదర్శకాల పైన లబ్ది దారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos