హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ సంఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ళ ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి.. అల్లు అర్జున్ పేరును చేర్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.
తన సినిమా పుష్ప 2 ను అభిమానులతో కలిసి చూడాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవడంతో తొక్కిసలాట జరిగిన సందర్భంగా మహిళ మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తామని ప్రకటించాడు. పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామన్నాడు.
మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటన కేసును కొట్టి వేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి తనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని, ఈ కేసును కొట్టి వేయాలని కోరాడు. పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ముందే సమచారం ఇచ్చానని, ఇందులో తన తప్పేమీ లేదని వివరించాడు. కానీ పోలీసులు తమ విధుల్లో భాగంగా అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం తాజా పరిణామం.
కాగా గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ, పోలీసులు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పెద్ద హీరోల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ జరిగిన సమయంలో అభిమానులు మరణించిన ఘటనలు చాలానే చూశాం. కానీ ఒక్క అల్లు అర్జున్‌పైనే కేసు నమోదు కావడం, ఆయన్ను అదుపులోకి తీసుకోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానం అల్లు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వగా, అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు. ఇక పుష్ప-2 విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించక పోవడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్‌లో టికెట్ల రేట్లు పెంచినందుకు తెలంగాణ సీఎంకు కృతజ్క్షతలు చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనిపై కూడా అల్లు అర్జున్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అసలు ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆయన్ను కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో చట్టం ముందు ఎవరైనా సమానమే అని తెలంగాణ పోలీసులు నిరూపించినట్టు అయింది. సెలబ్రిటీ అయినప్పటికీ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం ద్వారా తమకు అందరూ సమానమే అని తెలంగాణ పోలీసులు చాటి చెప్పారని సర్వత్రా కామెంట్లు వెలువడుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos