బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి - కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని, నేడు ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా- ఛత్తీస్‌గఢ్ వైపు కదిలుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీపరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వినాయక నిమజ్జనాల్లో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos