ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలోని రెండు పార్టీల క్యాడర్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న క్రమంలో కూటమిలో లుకలుకలు ఉన్నాయనే ప్రచారం జరగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం.. అని నినాదాలు చేస్తుండగా.. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు బహిరంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలోనే కూటమి ప్రభుత్వంలో విభేదాలు వస్తున్నాయని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ విస్తృతంగా వ్యాపించింది.
ఈ క్రమంలో తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని, అందుకు బీజేపీనే కారణమని, రాజకీయ లబ్ధి కోసం కేంద్రం లోని బీజేపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలనే దానిపై బీజేపీ యోచిస్తోందని, అందులో భాగంగానే బీజేపీ ఈ రాజకీయం చేస్తోందని అన్నారు. తన రాజకీయ మిత్రులతో రాజకీయ లబ్ధి పొంది.. అదే రాజకీయ పార్టీని అంతమొందించాలనేదే బీజేపీ ఎత్తుగడ అని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో కయ్యం తమ మనగడకు కష్టమనే విషయం బీజేపీకి తెలుసునని చెప్పారు. బీజేపీకి ప్రస్తుతం పూర్తి స్థాయి మెజార్టీ లేదని... ఆ పార్టీ వ్యవహరించే శైలితో చంద్రబాబుతో పాటుగా.. నితీష్ కుమార్‌తో ప్రమాదం రావచ్చునని అన్నారు.
2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్‌లో బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తున్నదని అద్దంకి దయాకర్ ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు అని అన్నారు. భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదగడం అనేది చాలా ప్రమాదకరమన్నారు. భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉండబోతుందని అన్నారు. తెలంగాణలో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో ను విడుదల చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos