ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకే రకమైన వస్త్రధారణతో అసెంబ్లీకి విచ్చేసిన మహిళా ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఈ మహిళా ప్రజాప్రతినిధులు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలను కూడా కలిసి మాట్లాడారు. దీంతో శాసనసభ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది.
అనంతరం ఈ మహిళా ప్రజాప్రతినిధులందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు చూపిన ఉత్సాహాన్ని, వారి ఐక్యతా స్ఫూర్తిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇస్తూ, పండుగ స్ఫూర్తిని సభకు తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి, వారి సంఘటితత్వానికి ఇది నిదర్శనమని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా, శాసనసభ వేదికగా మన సంప్రదాయాలను గౌరవించుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముందస్తు శివరాత్రి వేడుకల సందడి అసెంబ్లీ వాతావరణానికి కొత్త శోభను తెచ్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos