దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు ముందే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీలో జనసేన పార్టీకి కూడా ఆహ్వానం అందింది. దీనిపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చిందని , అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించినట్లు జనసేన తెలిపింది.

ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరఫున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారని, వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. ఆ మేరకు సమాచారం ఇచ్చామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే, ఈ అంశంపై తమ విధానం తమకు ఉందని జనసేన పార్టీ తెలిపింది. ఈ విషయమై తమ విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తామని వెల్లడించింది.

Related Videos