ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు సుమారు 20 మంది వరకు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. వంద మంది దాకా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి... అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.
త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించింది.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి వివరాల గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని చెప్పారు. ప్రాణనష్టం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని అఖాడా పరిషత్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని ఆచరించాల్సిన అమృత్ స్నానాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. వివిధ అఖాడాలకు చెందిన మహంతులు, అధ్యక్షులతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని, అంచనాలకు మించి భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చారని అఖాడా పరిషత్ పేర్కొంది.
మౌని అమావాశ్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగివచ్చి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారనేది నమ్మకం. ఇక్కడే మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరిస్తే జీవితం ధన్యమవుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకు ప్రధానంగా గంగ, యమునా, సరస్వతి సంగమ ప్రదేశం హిందూ దేవతలతో పవిత్రత ముడిపడి ఉంది. ఈ ఒక్కరోజే పది కోట్ల మంది గంగానదిలో స్నానం చేస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గ ఏర్పాటు చేసినప్పటికి కూడా భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా జనవరి 13 నుంచి కుంభమేళా ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 15కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos