ఏపీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు రెండు కుటుంబాలే నడిపిస్తున్నాయి. .వేర్వేరు పార్టీల్లో ఒకే కుటుంబంలోని వారు ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలను ఆయా కుటుంబాలే నడిపించే స్థాయికి ఏపీ రాజకీయం చేరింది. ఏపీలో ప్రధాన పార్టీలలో వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు వరుస క్రమంలో ఉంటాయి. ఇవి కాకుండా వామపక్షాలు, జనసేన కూడా ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నాయి. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన వైఎస్సార్సీపీని జగన్మోహన్ రెడ్డి స్థాపించి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనతో పాటు 2019 వరకు వైసీపీతో కలిసి సాగిన షర్మిల రెండేళ్ల క్రితం సొంతంగా తెలంగాణ పార్టీని స్థాపించి ఇటీవలే కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అన్నతో సమరానికి సై అంటున్నారు. అన్నా చెల్లెళ్లు చెరో పార్టీని నడిపిస్తున్నారు. జగన్ వైసీపీలో ఉండగా ... షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తకున్నారు. ఇక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ ని . దాదాపు మూడు దశాబ్దాలుగా మాజీ సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారు. మూడు విడతల్లో దాదాపు 14ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు దక్కించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు రావాలని శ్రమిస్తున్నారు. ఏపీలో మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేపట్టారు. రాష్ట్రమంతటా పర్యటనలతో బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ఓ పార్టీలో ఉంటే, కుమార్తె మరో పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో రెండు రాజకీయ పార్టీలను వైఎస్సార్ వారసులు నడుపుతుంటే, మరో రెండు పార్టీలను ఎన్టీఆర్ కుటుంబీకులు నడుపుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీల బలాబలాలు ఎలా ఉన్న రాజకీయాలు మాత్రం రెండు కుటుంబాల నడుమే సాగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos