ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై వాతావరణ శాఖ తాజాగా అలర్ట్స్ జారీ చేసింది. మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. బుధవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మరోవైపు మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 6 లక్షల 86 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన కాలువలతో కలుపుకొని బ్యారేజి దిగువకు 6 లక్షల 86 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి వరద నీరు అధికారులు విడుదల చేస్తున్నారు. మరో వైపు గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉదయం 5 గంటలకు 9 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దిగువన కోనసీమలో వరద జోరు కొనసాగుతుంది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో తుళ్లూరు, తాడేపల్లి, కొల్లపర, దుగ్గిరాల మండలాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos