ప్రజలను పేదిరికం నుంచి బయటపడేసే పీ4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్శిటీ ఆడిటోరియంలో 'స్వర్ణ కుప్పం విజన్- 2029' డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఈ రోజు సీఎం విడుదల చేసిన డాక్యుమెంటరీ స్వర్ణ కుప్పం లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు కుప్పం ప్రాంత సమగ్రాభివృద్ధే దీని ప్రధాన ఉద్దేశం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి పైగా ఉపాధి అకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేసినట్టు సమాచారం. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో రెండు కొత్త డెయిరీలు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కాగా కుప్పంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇవాళ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఏటా ఏ అభివృద్ధి పనులు చేయాలో ప్రణాళికలు రచించామని, కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తామని, ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పుటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని, తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తున్నదని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, జూన్‌లోపు హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెస్తామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. పాలారు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నం చేస్తామని, వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భజలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సౌర విద్యుదుత్పత్తి కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, కరెంట్ బిల్లులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని, సాంకేతికత అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కరించి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos