ఏపీలోని కడప జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది కడప టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని వీఆర్‌లోకి పంపడం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ అయింది. కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ యాదవ్ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజాలపై కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే ఆయన్ను వీఆర్‌లోకి (వేకెన్సీ రిజర్వ్) పంపుతూ ఉత్తర్వులు వెలువడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
“అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటే పోలీస్ అధికారిని శిక్షించడమా?” అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ కీలక నేతల పేర్లు కేసులో చేర్చినందుకే సీఐపై చర్యలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అనుకూల పోలీసు అధికారుల ఒత్తిడితోనే ఈ పరిణామం చోటుచేసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీఐ రామకృష్ణ యాదవ్ గతంలో వైసీపీ హయాంలోనూ వేధింపులకు గురయ్యారని సమాచారం. 2019 తర్వాత వన్‌టౌన్ సీఐగా పనిచేస్తుండగా బదిలీ చేసి వీఆర్‌లో ఉంచిన నాటి ప్రభుత్వం, అనంతపురం జిల్లాకు పంపి అక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రెండేళ్లపాటు వీఆర్‌లోనే ఉంచినట్లు తెలుస్తోంది. అప్పట్లోనూ అంజాద్ బాషా ఒత్తిడి కారణంగానే ఆయనను జిల్లా నుంచి పంపినట్లు రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీఐపై తీసుకున్న చర్యను పునరాలోచించాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వైసీపీ నేత అంజాద్ బాషా పీఏ ఖాజాను మాత్రమే నిందితుడిగా చేర్చాలని, ఆయనతో పాటు అంజాద్ బాషా, అహ్మద్ బాషాలను ఎందుకు చేర్చావని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ సీఐని ప్రశ్నించినట్లు సమాచారం. సీఐ తన నిర్ణయాన్ని మార్చడానికి నిరాకరించటంతోనే ఆయనను వెంటనే వీఆర్‌లోకి పంపారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే SP నచికేత్ విశ్వనాథ్ స్పందిస్తూ “సీఐ క్రమశిక్షణ ఉల్లంఘించారని, అందుకే తాత్కాలిక చర్యలు తీసుకున్నామని” వివరణ ఇచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల అనుమానాలను నివృత్తి చేయలేదు. ఈ ఘటనతో టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos