పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్నాడు జిల్లా జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎనిమిది నెలల క్రితం తాను సిఫార్సు చేసిన రామినేని ప్రసాద్‌ను లీగల్ అడ్వైజర్‌గా నియమించాలని కోరుతూ ఎమ్మెల్యే అరవింద బాబు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. దీనిపై విచారణ జరిపి ఉత్తర్వులిస్తానని ఎస్పీ చెప్పగా, నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎమ్మెల్యే ఎస్పీ ఛాంబర్‌లోనే భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సాయంత్రం వరకు నిరసన కొనసాగించిన ఎమ్మెల్యే, ఒక దశలో ఎస్పీ ఛాంబర్‌లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్ లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర టీడీపీ నేతలు వచ్చి ఇవాళ ఏప్రిల్ 1 బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో నిన్న మంగళవారం రాత్రి 9:45 గంటలకు ఆయన ధర్నా విరమించారు. మరోవైపు ఇదే రోజు ఉదయం ఆర్‌డీవో కార్యాలయంలోనూ ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే గంటపాటు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలోనూ ఆయన ఇలాగే ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఆ ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే ఆయనను వివరణ కోరిన నేపథ్యంలో, తాజా ఘటనతో ఆయన తీరుపై పార్టీ నాయకత్వం మరింత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos