ఏపీలో గత ఐదేళ్లలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు .. ఇళ్లలోని మహిళలపై కూడా దారుణ వ్యాఖ్యలు చేశారంటూ గగ్గోలు పెట్టిన కూటమి పార్టీలకు ఓ టీడీపీ కార్యకర్త షాకిచ్చాడు. గుంటూరుకు చెందిన చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త .. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి తీవ్రమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
వైఎస్ భారతి క్యారెక్టర్ ను తప్పుబట్టేలా చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీనే కాదు అన్ని పార్టీలను కూడా కలవరపెట్టాయి. చేబ్రోలు కిరణ్ ఉన్మాద చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇన్నాళ్లూ వైసీపీ కార్యకర్తలు అలా చేశారంటూ విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఏమంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సెగ టీడీపీ అధిష్టానాన్ని సైతం తాకింది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు. వైఎస్ భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం ...మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. గంటూరులో అతన్ని అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ... టీడీపీ అధిష్టానం కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మరోవైపు చేబ్రోలు కిరణ్ తాజా పరిణామాలపై ఎక్స్ లో స్పందించాడు. తాను వైఎస్ బారతిపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాడు. మరోసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించాడు. వైఎస్ భారతిపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీకరించాడు. అయితే నెటిజెన్లు ఏమాత్రం శాంతించకుండా చేబ్రోలు కిరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos