ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ బీద రవిచంద్రయాదవ్, బీటీ నాయుడు, కావల గ్రీష్మలకు అవకాశం ఇచ్చింది. జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు, బీజేపీ నేత సోము వీర్రాజు అభ్యర్థులుగా ఉన్నారు. అయితే టీడీపీకి దక్కిన మూడు స్థానాల కోసం గట్టి పోటీనే వచ్చింది.. ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. స్వయంగా అధినేత చంద్రబాబు ... వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. అయితే వర్మకు ఈసారి కూడా ఛాన్స్ దొరకలేదు. దీంతో ఆయన అభిమానులు, అనుచరులు వచ్చి వర్మను కలిశారు. ఈ క్రమంలో వర్మ ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో 23 ఏళ్లుగా ప్రయాణం కొనసాగుతోందని.. తనకు పదవి రానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని వర్మ అన్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని.. ఈసారి కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చని అన్నారు. తాను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని.. ఇలాంటి అవకాశం దక్కడమే తనకు పెద్ద పదవి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎల్లవేళలా ఉంటాయని.. ఎన్నికల సమయంలో కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామన్నారు. తమ పాత్ర తాము పోషించామన్నారు.
ఎమ్మెల్సీ పదవి ఆశించినవారిలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, బూరుగుపల్లి శేషారావు, కొమ్మాలపాటి శ్రీధర్, కేఎస్ జవహర్.. మాజీ ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, యనమల, బుద్దా ఇలా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా పదవి ఆశించారు.. కానీ వీరికి అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీని ఆశించినవారికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మరికొందరు పార్టీ పెద్దలు ఫోన్ చేసి బుజ్జగించారు. 2027లో మరికొన్ని ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని.. అప్పుడు అవకాశం కల్పిస్తామని సర్థిచెప్పినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos