న్యూఢిల్లీ: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు — వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ — న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.

సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీల మీద కొందరికి ఉన్న రాజకీయ, వ్యక్తిగత కక్ష కారణంగానే వారికి దక్కాల్సిన అవకాశాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడం, వారికి రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడూ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలులోకి వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు దక్కుతాయని ఆయన తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌ల నుంచి మొదలుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మేయర్‌లుగా ఎదిగి, భవిష్యత్తులో చట్టసభలకు, అసెంబ్లీలు, పార్లమెంట్‌కు వెళ్లే గొప్ప అవకాశాలు వీరికి లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

బలహీన వర్గాల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తదుపరి న్యాయ పోరాట వ్యూహాలపై చర్చించేందుకు  ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీకి రావడం జరిగిందని తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో సమావేశమైన మంత్రుల బృందం, న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు తీర్పులు వివిధ కమిషన్‌ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు విధివిధానాలపై ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దేవదత్ కామత్  చర్చించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు బలహీన వర్గాలను కేవలం ఓట్ల యంత్రాలుగానే చూశారని, ఆ పరిస్థితులను మార్చడానికి స్వర్గీయ ఎన్.టి. రామారావు  ఆ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచేందుకు 1987లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తొలిసారిగా స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు దానిని 34 శాతానికి పెంచారని ఆయన వివరించారు.


అయితే గత  ప్రభుత్వం ఎలాంటి చట్ట సవరణ చేయకుండా, కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా బలహీన వర్గాల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. . బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేస్తామని, ఇందుకోసం సుప్రీంకోర్టులో తగిన కేసులు వేసి నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంతో పాటు, వారికి రాజకీయ, ప్రజాస్వామ్య సాధికారత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి  తెలిపారు. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు కేవలం ఏదో రిజర్వేషన్ ఇవ్వాలనే కాకుండా, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలు, 243డి, 243టి సెక్షన్ల ప్రకారం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల్లోనూ బలహీన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : 31st CII Partnership Summit -2026| Regional Conference at IIM| Visakhapatnam |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos