ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా దశాబ్ద కాలం క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాన చేసిన రాజధానిని వైఎస్సార్సీపీ సర్కార్ విధ్వంసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.
అందుకే నేడు మళ్లీ అదే ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని చంద్రబాబు తెలిపారు. గత సర్కార్ అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని ధ్వజమెత్తారు. అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నింటినీ తట్టుకుని నిలబడిందని ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం మొదలవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
అమరావతి పునఃప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నేడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన ఆహ్వానం పలకనున్నారు. వేడుకకు వచ్చేందుకు విద్యార్థుల నుంచి పెద్దఎత్తున వినతులు వస్తున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్ తరాల రాజధాని నిర్మాణం నేటి విద్యార్థుల కోసమేనన్న చంద్రబాబు వారి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు.
సభకు వచ్చేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణపై అధికారులు ఆయనకు ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. భద్రతాపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్పారు. రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు, ప్రకటనలు చేయాలని నిర్దేశించారు. ప్రధాని రాకకు సంబంధించి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ కొత్త షెడ్యూల్‌ని మంత్రి వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos