మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. తాజాగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో.. చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. త్వరలో బీహార్, ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇటీవల టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు.
ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ క్రమంలో టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతి రాజు కు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాదరహితుడు.. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు బీసీ, ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నా .. ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది.
రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. అయితే, కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వగా... ఆయన పత్తికొండ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కేఈ క్రిష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేసారు. ఈ సారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక.. జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ - తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైనా చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రంలో మరో మంత్రి పదవి.. గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos