నెల్లూరు/కావలి: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్య కారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మత్స్య కారుల సంక్షేమానికి.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు చేసే ఫేక్ ప్రచారాలను పట్టించు కోవద్దని స్పష్టం చేశారు. నెల్లూరు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం మత్స్య కారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్య కార కుటుంబాలకు రూ. 261.50 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. మత్స్య కారుల సేవలో కార్యక్రమంతో మత్స్య కారుల కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే మత్స్య కారుల సేవలో లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. దీంతో తమకు డబ్బులు జమ అయ్యాయంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సెల్ ఫోన్లల్లో వచ్చిన మెసేజీలను ముఖ్యమంత్రికి లబ్దిదారులు చూపించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుంది. తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్య కారులకూ భాగస్వామ్యం ఉండాలి.  అభివృద్ధిని మత్స్య కారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తాం. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోంది. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం. మత్స్య కారులను ఆర్ధికంగా బలోపేతం చేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. వీటిపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు. ఫేక్ ప్రచారాలను నమ్మ వద్దు. ఈ తీరం మనది, బోటూ మనదే.. ఇక్కడ సంపద కూడా మనదే. ఈ విషయంలో రాజీ లేదు. మన తీరప్రాంతానికి పొరుగు రాష్ట్రం వారు ఎవరొచ్చినా సహించేది లేదు. మత్స్యకారుల హక్కులు కాపాడతాం. మన తీరప్రాంతంలో నిఘా పెట్టి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. తీరం మనదే, బోటు మనదే వేటా మనదే ఇదే సీబీఎన్ మాట.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్ లా వ్యవహరిస్తా...

“రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. అక్కడ చేపల పెంపకం చేపట్టండి. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం. చేపల వేటతో పాటు కొత్త ఆదాయ మార్గాలను కూడా  మత్స్య కారులకు అందుబాటులోకి తెస్తాం. మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్ర తీరప్రాంతంలో నివసించే మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు చేపడుతున్నాం. టెక్నాలజీతోపాటు... వినూత్న పద్దతుల ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా ఆదుకుంటాం. చేపల వేటకు వెళ్లే మత్స్య కారులకు అండగా నిలబడడమే కాకుండా... మత్స్య కార మహిళలకు ఉపాధి కల్పించి.. ఆర్థిక సాధికారత కల్పిస్తాం. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. మత్స్య కార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్రపు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తాం. చేపలు మంచి పౌష్టికాహారం. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రోటీన్ ఉన్న ఈ ఆహారానికి అన్ని చోట్లా గిరాకీ ఉంది. మత్స్య ఉత్పత్తులకు గిరాకీ సృష్టించేలా మార్కెటింగ్ మేనేజర్ గా వ్యవహరిస్తాను.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మత్స్య కారుల సేవలో ఉంటాం... అండగా నిలుస్తాం

“దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఇది కొనసాగాలంటే... మత్స్య కారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి... వారికి అండగా నిలవాలి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మత్స్య కారులకు మేం అండగా ఉంటాం. మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు లీటరుకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం. 2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడిని మత్స్య కార బోట్లకు అందించాం. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంది. మత్స్య కారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోంది. 200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారుల కోసం శాంక్షన్ చేస్తాం. 60 శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తాం. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ లభ్యం అవుతాయో అనే సమాచారాన్ని కూడా ఇస్తున్నాం. మెకనైజ్డ్ బోట్లతో సులువుగా చేపల వేట చేసేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఆక్వా కల్చర్ కు అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్ కు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మన రాష్ట్రానికి ఏ రంగంలో ఆదాయం వస్తుందో దానిపై శ్రద్ధ పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సేవలో పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం. రాష్ట్రంలో మత్స్య కారుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వారిని ఆదుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ మత్స్య కార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం. 2014-19 మధ్యలోనూ చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల వరకూ ఆర్ధిక సాయం చేసి టీడీపీ ప్రభుత్వం ఆదుకుంది. మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు ఆర్ధిక సాయాన్ని పెంచి ఇస్తున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు...

“గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వారికి నాటి ఐదేళ్ల పాలనలో కష్టాలే ఉన్నాయి. 2019-24 మధ్యలో చేపల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత మత్స్య సంపద పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఇలాంటి రంగాన్ని కూడా వాళ్లు విధ్వంసం బాట పట్టించారు. గొడ్డలి పార్టీ లేనిపోని కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోంది. బాబాయ్ హత్య నుంచి పెద్ద దస్తగిరి వరకూ హత్యలు చేస్తూ... కుట్రలు పన్నుతూ రాష్ట్రాన్ని వెనక్కు లాగుతోంది. వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరి చేయడానికి 23 నెలల సమయం పట్టింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించటంతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. బుల్లెట్ స్పీడ్ లో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. రాయలసీమలో డిఫెన్సు, డ్రోన్స్, స్పేస్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలు వస్తున్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తిరుపతి వద్ద బుల్లెట్ మోటారు సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. మరిన్ని వస్తాయి. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో 25 మత్స్య కారుల గ్రామాలను కనెక్టు చేస్తూ మెటల్ రోడ్లు వేస్తాం. నార్త్ బకింగ్ హామ్ కెనాల్ డీసిల్టింగ్ కు రూ.6.19 కోట్లను మంజూరు చేస్తున్నాం. ఈ కాలువను ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ గానూ తీర్చిదిద్దుతాం. ప్రతీ ఇంటిపైనా,  పొలంలోనూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు.

“టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారు. బీసీలకు- టీడీపీకి దశాబ్దాల అనుబంధం. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వేతనం, వడ్డెర్లకు, గీత కార్మికులకు గనులు, మద్యం దుకాణాలను కేటాయిస్తున్నాం. 45 ఏళ్లుగా బీసీలు టీడీపీని ఆదరించారు. వారి రుణం తీర్చుకుంటాం. బీసీల కోసం... బీసీ మహిళల కోసం కొత్త విధానాలను అమల్లోకి తెచ్చి.. వారిని ఆర్థికంగా చేయూత ఇస్తున్నాం. సీవీడ్ లాంటి కొత్త ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా అదనపు ఆదాయం సంపాదించేలా చర్యలు చేపడతాం. మత్స్య కారుల జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. మత్స్య కార యువతకు నైపుణ్యాలు నేర్పి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా ప్రజల సేవకులే. జవాబుదారీతనంతో పనిచేయాలనే లక్ష్యాన్ని పెట్టాం. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపై కూడా పడింది. ఆయిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఉంది. మనం అంతా నా దేశం- నా బాధ్యత అనుకుని పనిచేయాలి. ప్రధాని మోదీ 7 సూత్రాలను సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అనవసరపు ప్రయాణాలు తగ్గించుకుందాం. ప్రజా రవాణాను మాత్రమే వినియోగిద్దాం. బంగారం కొనుగోలును వాయిదా వేద్దాం. టూరిజం కోసం విదేశీ ప్రయాణాలు తగ్గించుకుందాం. మన దేశంలోనే పర్యాటక ప్రాంతాలు, బీచ్ లకు వెళ్లాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos