ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది.. భవిష్యత్తు భారతీయులదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన రీసెర్చ్ స్కానర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటీ నుంచి వస్తున్న పట్టభద్రులు ఏర్పాటు చేస్తున్న స్టార్టప్స్ సక్సెస్ రేటు 80 శాతం ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో నలభై శాతం వరకూ తెలుగు విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని చెబుతూ.. అగ్నికుల్ స్టార్టప్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఐటీ మద్రాస్ లో జరిగిన సమావేశానికి చంద్రబాబు రాగానే అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. చంద్రబాబు పరిచయ ప్రసంగాన్ని నిర్వాహకులు చదువుతున్నప్పుడు.. చప్పట్లతో ఆడిటోరియం హోరెత్తింది.
విద్యాభ్యాసం తర్వాత నూతన స్టార్టప్‌లతో వ్యాపారస్థులుగా స్థిరపడాలనే ఆలోచనలు ఐఐటీ విద్యార్థులవని పేర్కొన్నారు. రాజకీయ సంస్కరణలు-ఆర్ధిక సంస్కరణల్లో జరిగిన విప్లవాత్మక మార్పులకు రష్యా, చైనాలే ఉదాహరణలని స్పష్టం చేశారు. రాజకీయ సంస్కరణల వైపు వెళ్లిన రష్యా చిన్న చిన్న దేశాలుగా విడిపోయిందని గుర్తు చేశారు. ఆర్ధిక సంస్కరణల వైపు వెళ్లిన చైనా మాత్రం ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా టెలికమ్యూనికేషన్స్, ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహించామని తెలిపారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు కోసం బిల్ గెట్స్ని ఒప్పించిన అనుభవాలను విద్యార్థులతో సీఎం పంచుకున్నారు. బిల్‌గేట్స్‌ను మొదట తాను కలుస్తానని అడిగినప్పుడు రాజకీయనేతలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్ తీసుకున్నానని, 45 నిమిషాలు మాట్లాడానని అన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు.
భారత్‌కు ఉన్న గొప్ప వరం జనాభా అని చంద్రబాబు అన్నారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటున్నాయని, భారత్‌కు మరో 40 ఏళ్ల వరకూ జనాభా సమస్య లేదని పేర్కొన్నారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం అమెరికన్ ఇండియన్లదే అని తెలిపారు. అమెరికాలోని ఖరీదైన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుగు, తమిళంలో పిలిస్తే చాలామంది పోగవుతారన్నారు. భారతీయులు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సర్దుకుపోగలుగుతారని, 2047 నాటికి భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతారని అభిప్రాయపడ్డారు. భారతీయులు సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకుంటారని, రానున్న రోజుల్లో అమరావతిని క్యాంటమ్ వ్యాలీగా నిలబెడతామని స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన యువశక్తి మన సొంతమన్నారు. కాగా, చంద్రబాబును ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రసంగాలకు గాను ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటాయి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే ముస్సోరి క్యాంపస్ నుంచి కూడా చంద్రబాబుకు ఆహ్వానాలు వస్తూంటాయి. పలుమార్లు అక్కడ ప్రసంగించారు. దేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు అయిన చంద్రబాబు.. వ్యవస్ధల మెరుగుదల కోసం తన అనుభవాలను వివరిస్తూ ఉంటారని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos