ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
2024 అక్టోబర్‌లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తోందని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లు) సమీకృత పెట్టుబడి వస్తోందని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే 7.5 గిగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లు కూడా ఏర్పాటవుతాయని తెలిపారు
ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్టు ఇదే మొదటిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీతో పాటు ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, పారిశ్రామిక అనుకూల వాతావరణం వల్లే ఇలాంటి చరిత్రాత్మక ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చంద్రబాబు తన ప్రకటనలో వివరించారు.
కాగా కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిన గ్రీన్ కో సంస్థపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ కో సంస్థకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ వివరాలను ఆయన ప్రస్తావిస్తూ, "1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యంతో, 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్.. భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో, అధిక విలువైన రసాయనాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని" పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos